దసరా ఎఫెక్ట్ : ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ.. ఆస్తులు అమ్ముకోవాల్సిందే.
దసరాకు నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులను ప్రైవేట్ ట్రావెల్స్ దోచేస్తున్నాయి. ఇవాళ నాన్ ఏసీ బస్సుల్లో అదనంగా రూ. 700-1,000, ఏసీ బస్సుల్లో రూ.1,000-2,000 వరకు గుంజుతున్నాయి. ఆదివారం తిరుగు ప్రయాణానికి రెండింతల రేట్లు పెంచేశాయి. ఉదాహరణకు హైదరాబాద్ నుండికడపకు టికెట్ ధర రూ.1,000 ఉండగా, ఇప్పుడు రూ.2,000-3,000 లాగుతున్నాయి. ప్రత్యక్షంగానే దోపిడీ కనపడుతున్నా రవాణా శాఖ పట్టించుకోవట్లేదని విమర్శలు వస్తున్నాయి. ఇక ఇదే టైంలో ఏపీఎస్ ఆర్టీసీ ఇంద్ర బస్సుల్లో విజయవాడ నుంచి వైజాగ్‌కు రూ 905, అమరావతి నుంచి అయితే రూ. 1,120 మాత్రమే వసూలు చేస్తుండగా, నాన్ ఏసీ బస్సుల్లో ఈ ధరలు రూ. 700 మాత్రమే. అయితే, సరిపడా ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడం, ఉన్నా ఒకటి రెండ్రు సీట్లు మాత్రమే ఉండడంతో కుటుంబంతో కలిసి ఊరెళ్లాలనుకునే వారికి ఇబ్బందులు తప్పడం లేదు.
మరోవైపు, ఆదివారంతో దసరా సెలువులు ముగిసి పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున తిరుగు ప్రయాణాలుంటాయి. అప్పుడు బస్సులకు మరింత డిమాండ్ ఉంటుంది. దీనిని కూడా సొమ్ము చేసుకోవాలని, రెండింతల చార్జీలను వసూలు చేయాలని ప్రైవేటు ట్రావెల్స్ ఇప్పటి నుంచే రెడీ అవుతున్నాయి. విశాఖ నుంచి విజయవాడ టికెట్ ధరలను కొన్ని ట్రావెల్స్ రూ. 3 వేలుగా చెబుతూ ఆన్లైన్లో పెట్టాయి. ఇలా అయితే ఓ ఫ్యామిలీ సొంతూరికి వెళ్ళాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.



