వైసీపీ నేతపై పీడీ యాక్ట్

పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువుకు చెందిన ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన దాల్ మిల్ సూరిపై స్థానిక పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. దాల్ మిల్ సూరిపై పీడీ యాక్ట్ నమోదు చేయడంతో పాటు అతనిపై పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. దాల్ మిల్ సూరి వివిధ వ్యాపారాల పేరుతో చాలా మందిని కోట్లాది రూపాయల మేర మోసం చేసి, తప్పించుకుని తిరుగుతున్నాడనే ఆరోపణలతో పలువురు పిర్యాదులు చేయడంతో పోలీసులు అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు.
ఈ సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్న మీడియాతో మాట్లాడుతూ…” దాల్ మిల్ సూరి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వివిధ వ్యాపారాల పేరుతో కోట్లాది రూపాయల మోసాలకు పాల్పడ్డాడని, ఆయనపై 36 కేసులు నమోదయ్యాయని” మీడియాకు తెలిపారు. అంతేకాకుండా కోట్లాది రూపాయల మోసాలకు పాల్పడడమే కాకుండా, ఆర్థిక నేరాలకు కూడా పాల్పడినట్టు తమ విచారణలో తేలిందని ఎస్పీ రత్న వెల్లడించారు.
స్థానిక జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పీడీ యాక్ట్ నమోదు చేశామని ఎస్పీ రత్న మీడియాకు తెలిపారు. సూరిపై కొత్తచెరువు పీఎస్ లో 20 కేసులు, నెల్లూరు రూరల్ పీఎస్ లో 16 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో సూరి బాధితులు ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయవచ్చని ఈ సందర్భంగా మీడియా ద్వారా బాధితులను కోరారు.