ఏపీలో కొత్త రైల్వే లైన్లు

పల్లవి, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు నుంచి దొనకొండ, దూపాడు నుంచి బేతంచర్ల, మచిలీపట్నం నుంచి నరసాపురం, రేపల్లె వంటి ప్రాంతాలకు కొత్త రైల్వే లైన్లు నిర్మించేలా సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు సిద్ధమవుతున్నాయి. ఏపీ మీదుగా హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి చెన్నైలకు బుల్లెట్ రైళ్లు నడిపేలా హైస్పీడ్ కారిడార్ల నిర్మాణం, ఇప్పటికే ఉన్న మార్గాల్లో రైళ్ల రద్దీ ఎక్కువగా ఉండే వైపు అదనంగా మూడు, నాలుగు, ఐదు, ఆరో లైన్ నిర్మాణానికి డీపీఆర్‌లు తయారు చేస్తున్నారు.
మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 1,960 కి.మీ. మేర 26 ప్రాజెక్టులకు రైల్వేశాఖ డీపీఆర్‌లు రూపొందిస్తోంది.ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్, విజయవాడ, గుంటూరు, గుంతకల్ ఆరు డివిజన్లు ఉన్నాయి. పునర్విభజన తర్వాత సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు దక్షిణ మధ్య రైల్వేలో మిగులుతాయి.
విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు ఏపీలో విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా జోన్‌లోకి వెళతాయి. ఇందులో సికింద్రాబాద్, గుంతకల్, విజయవాడ, గుంటూరు డివిజన్ల సరిహద్దుల్లో మార్పులకు ప్రతిపాదనలు వెళ్లాయి.మొత్తంగా 26 ప్రాజెక్టుల డీపీఆర్‌లు నవంబరు, డిసెంబరు నాటికి పూర్తిచేసేలా లక్ష్యాన్ని నిర్దేశించారు.