సర్పంచ్ దాడి వెనక ఎమ్మెల్యే హస్తం- వైసీపీ నేత అంబటి మురళి
పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీలో గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామానికి చెందిన సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై టీడీపీకి చెందిన కొంతమంది ఓ టీ షాపు వద్ద టీ తాగుతుండగా ఆయనపై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన్ని గుంటూరు లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటన గురించి వైసీపీ నేత అంబటి మురళీ మాట్లాడుతూ మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు పై జరిగిన దాడి వెనక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర హస్తం ఉందని ఆరోపించారు.
ఇటీవల జరిగిన ఓ సభలో నాగమల్లేశ్వరారావు కుటుంబాన్ని భూస్థాపితం చేయాలని టీడీపీ నేతలకు సదరు ఎమ్మెల్యే చెప్పారని ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. నడిరోడ్డుపై రాడ్డులతో దాడి జరిగితే పోలీసుల నుంచి సరైన వివరణ లేదని ఆయన మండిపడ్డారు.



