మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవిగా … ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
దసరా ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజున విజయవాడ దుర్గమ్మ సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు
దసరా ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజున విజయవాడ దుర్గమ్మ సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇవాళ మాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. బుద్ధి వికాసం కలుగుతుందని నమ్మకం. దుర్గామాత తన అంశలోని నిజ స్వరూపాన్ని సాక్షాత్కరించడమే ఈ రోజు అలంకారం ప్రత్యేకత. అమ్మవారిని తెలుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు. ‘ఓం శ్రీ సరస్వతీ దేవియే నమ:’ అనే మంత్రాన్ని పఠించాలని పండితులు చెబుతున్నారు. నేడు టికెట్ దర్శనాలను రద్దు చేసి వేకువజామున 3 గంటల నుంచే అందరికీ సర్వదర్శనం కల్పించారు.
సరస్వతీదేవిని దర్శించుకోవడం ద్వారా విద్యార్థులు వాగ్దేవి అనుగ్రహం పొంది సర్వ విద్యలలో విజయం సాధిస్తారని నమ్మకం. మరోవైపు నేడు విజయవాడ దుర్గమ్మకు ఏపీ సీఎం చంద్రబాబు సతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇవాళ మూల నక్షత్రం కావడంతో అమ్మవారు సరస్వతీ మాతగా దర్శనమివ్వనున్నారు. ఈ క్రమంలో దుర్గమ్మను వీక్షించేందుకు ఇంద్రకీలాద్రికి 2 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. క్యూలైన్లలో నీరు, మజ్జిగ, పాలు పంపిణీ చేస్తామని మంత్రి ఆనం నారాయణ రెడ్డి తెలిపారు.



