ఏపీ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం

పల్లవి, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఆరోగ్య భరోసాను కల్పించాలని ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంవానికి ఏటా రూ ఇరవై ఐదులక్షల వరకు ఉచిత వైద్యం అందించే ” యూనివర్శల్ హెల్త్ పాలసీకి ” సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో భేటీ అయిన క్యాబినెట్ మీటింగ్ లో ఆమోదం తెలిపారు.
అయితే ఈ కొత్త విధానాన్ని ‘ ఆయుష్మాన్ భారత్ – ఎన్టీఆర్ వైద్య సేవ’ పథకం కింద అమలు చేయనున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో అర్హులైన సుమారు కోటి అరవై మూడు లక్షల కుటుంబాలకు భారీ ప్రయోజనం చేకూరనుంది. ఈ పథకం పేద , మధ్య తరగతి ప్రజలు అత్యవసర సమయాల్లో అప్పుల పాలు కాకుండా చూసేందుకు దోహదపడుతుంది.
ఈ పథకం కింద వైద్య చికిత్సలకు కేవలం 6 గంటల్లోనే అనుమతులు మంజూరు చేసేలా ప్రత్యేకంగా ‘ప్రీ ఆథరైజేషన్ మేనేజ్‌మెంట్’ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 2,493 నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. హైబ్రిడ్ విధానంలో మొత్తం 3,257 రకాల చికిత్సలను ఈ పథకం పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది.