పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రూ.100కోట్లు ఖర్చు..!

పల్లవి, వెబ్ డెస్క్ : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఈరోజు మంగళవారం ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే వైసీపీకి చెందిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటాయనే నెపంతో ముందస్తుగా అరెస్ట్ చేశారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన తర్వాత అధికార టీడీపీకి చెందిన నేత, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ బీటెక్ రవి మాట్లాడుతూ ” మాజీ సీఎం , వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలవడానికి వైసీపీ అధినేత జగన్ కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నారు. జనాలను, ఓటర్లను భయాభ్రాంతులకు గురి చేస్తున్నరు. పోలింగ్ ప్రారంభమైన తర్వాత కూడా ఓటుకు ఐదు వేల చొప్పున వైసీపీ నేతలు పంచుతున్నారు. మహిళలకు చీరలు, ముక్కుపుడకలు పంపిణీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఐదేండ్ల పాటు అక్రమంగా సంపాదించిన సొమ్మును కేవలం జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలవడానికి కుమ్మరిస్తున్నారని ఆయన అన్నారు.