సెప్టెంబర్ 17..తెలంగాణకి ఎందుకంత ప్రత్యేకమైన రోజు?
హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలని ఏడో నిజాం ప్రయత్నించేవారు.
సెప్టెంబర్ 17 వస్తే చాలు తెలంగాణ రాజకీయ వేడి రగులుతుంటది. బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరుపుతుంటది..కాంగ్రెస్ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు జరుపుతుంటది..ఇంకోపార్టీ ఇంకో పేరుతో సెలబ్రేషన్స్ జరుపుతుంటది. ఒక రాజకీయ పార్టీ సెప్టెంబరు 17ను గుర్తించకుండా వేడుకలకు దూరంగా ఉందని మరొక పార్టీ ఆరోపిస్తుంటుంది. అయితే అసలు సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణలో ఎందుకు స్పెషల్ అనేది ఇప్పుడు చూద్దాం.
1948కి ముందు ఉన్న హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో కలిసిన రోజునే సెప్టెంబర్ 17. వాస్తవానికి 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి దేశానికి బ్రిటీష్ వాళ్ల నుంచి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటికే ఉన్న ఎన్నో సంస్థానాలు, రాజ్యాలు భారత యూనియన్ లో కలిసిపోయాయి. అయితే హైదరాబాద్, కశ్మీర్ రాజ్యాలు మాత్రం భారత్ లో కలిసేందుకు ముందుకు రాలేదు. ఫలితంగా హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు నిజాం రాజు నుంచి స్వాతంత్ర్యం రాలేదు. హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలని ఏడో నిజాం ప్రయత్నించేవారు. హైదరాబాద్ ను పాకిస్థాన్ లో అయినా విలీనం చేయాలని కూడా ఆయన ప్రయత్నం చేశారు.
దీంతో అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ హైదరాబాద్ పై సైనిక చర్యకు ఆదేశించారు. అలా 1948 సెప్టెంబర్ 13న భారత యూనియన్ సైన్యం నిజాం సంస్థానంలోకి ప్రవేశించింది. భారత సేనలను నిజాం సైన్యం సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. చివరికి 1948 సెప్టెంబర్ 17న నిజాం సరెండర్ కాక తప్పలేదు. 1948 సెప్టెంబర్ 18న నిజాం సంస్థానం అధికారికంగా భారత యూనియన్లో విలీనం అయింది. సెప్టెంబరు 17న నిజాం లొంగుబాటుకు కారణంగా ఆ రోజును తెలంగాణ విమోచన దినంగా పరిగణిస్తుంటారు.



