Save Damagundam: సేవ్ దామగుండం ఫారెస్ట్..తెలంగాణలో ఇప్పుడిదే హాట్ టాపిక్..
సోషల్ మీడియాలో కూడా సేవ్ దామగుండం అంటూ దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం తెలంగాణలో దామగుండం ఫారెస్ట్ పెద్ద హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో కూడా సేవ్ దామగుండం అంటూ దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మేడారంలో కొన్ని వేల చెట్లు నెలకొరిగిన సమయంలో అందరం చాలా బాధపడ్డాం..ఇప్పుడు మన కళ్ల ముందే 12 లక్షల చెట్లను నరికేయబోతున్నారంటూ..పెద్ద ప్రకృతి విధ్వంసం జరుగుతోందని కొందరు రోడ్డెక్కి..మరికొందరు సోషల్ మీడియాలో నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పలువురు లేఖలు రాస్తున్నారు. అయితే అసలు ఈ దామగుండం ఫారెస్ట్ ఎక్కడ ఉంది..అసలే చెట్ల కొరతతో ఆక్సిజన్ తో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఉన్న లక్షల చెట్లను నరికి ఏం చేయాలనుకుంటున్నారనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
హైదరాబాద్ కు అతిసమీపంలోని వికారాబాద్ జిల్లాలో దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఈ దామగుండం అడవి కొన్ని లక్షల చెట్లకు నెలవు. జింకలు, తోడేళ్లు, అడవి పందులు, అనేకరకాల పక్షులకు ఆలవాలమైన ఈ అడవి జీవవైవిధ్యంతో అలరారుతున్నది. అంతేకాకుండా ఈ అడవి ఎన్నోరకాల అరుదైన, ఔషధ మొక్కలకు కూడా ప్రసిద్ధి. వికారాబాద్ జిల్లాలోని పూడూరు సమీపంలో ఈ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలోనే భారత నౌకాదళ సంస్థ 2900 ఎకరాల్లో రూ.2500 కోట్లతో..జలాంతర్గాములతో కమ్యూనికేట్ చేయడానికి చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ(VLF) రాడార్ స్టేషన్ నెలకొల్పాలని ఫ్లాన్ చేసింది. సముద్ర మట్టానికి 350 మీటర్ల ఎత్తులో ఉండటంతో సిగ్నల్ వ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఈ ప్రాంతాన్ని నేవీ ఎంచుకుంది. అయితే ఇది అనుకున్నట్లు జరిగితే నేవీ స్టేషన్‌తో పాటు, నేవీ సిబ్బంది కోసం స్కూల్స్, హాస్పిటల్స్, బ్యాంకులు, మార్కెట్లతో కూడిన టౌన్షిప్ దామగుండంలో ఉంటుంది. దీనికోసం 12 లక్షల చెట్లను నరికేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు 27 కి.మీ మేర రహదారిని నిర్మించనున్నారు. రాడార్ స్టేషన్ ఏర్పాటుతో లక్షలాది వృక్షజాతి సంపద, జీవరాశులతో పాటు ఐదు శతాబ్దాల చరిత్ర కలిగిన దామగుండ రామలింగేశ్వర స్వామి ఆలయం మనుగడకు ప్రమాదం ఏర్పడనుందని..ఆ ప్రాంతం మొత్తం కాలుష్యకోరల్లో చిక్కుకోనుందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. గ్రౌండ్ వాటర్ కూడా కలుషితం అయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
కాగా,తూర్పు నౌకాదళ కమాండ్ (ENC) 2008లోనే VLF రాడార్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడానికి పూడూర్, దామగుండం గ్రామాలలో సుమారు 2,730 ఎకరాలు కేటాయించాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో దీనికి సంబంధించి జీవో జారీ చేసినప్పటికీ, ఆ తర్వాత భూమి కేటాయింపు నుండి దూరంగా ఉంది. లక్షల సంఖ్యలో చెట్లు నరికివేతతో సంభవించే దుష్ప్రభావాల గురించి స్థానికులు ఆందోళనలు వ్యక్తం చేయడంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నేవీకి భూమిని కేటాయించలేదు. అయితే సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత దీనికి సంబంధించిన పనులు ఊపందుకున్నాయి. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో దామగుండం అటవీ భూమిని కేటాయించడానికి అంగీకరిస్తూ ఇండియన్ నేవీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం అయితే పర్యావరణానికి,ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముందన్న ఆందోలనలు వ్యక్తమవుతున్నాయి.



