కాంగ్రెస్ లో చేరిన అరెకపూడి గాంధీ.. సీఎం రేవంత్ సమక్షంలో చేరిక
పల్లవి, హైదరాబాద్: శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇవాళ ఉదయం తన అనుచరులు, పలువురు కార్పొరేటర్లతో కలిసి జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి చేరుకున్న ఎమ్మెల్యే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీఎం ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శేరిలింగంపల్లి నుంచి గాంధీ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన గాంధీ.. ఆ తరువాత బీఆర్ఎస్లో చేరారు. అనంతరం 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో, ఇటీవల 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున వరుసగా రెండుసార్లు విజయం సాధించారు.
నిన్న రాత్రి ప్రకాశ్ గౌడ్..
రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ నిన్న రాత్రి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం తన అనుచరులతో కలిసి ఆయన హస్తం పార్టీలో చేరారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నుంచి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం కాగా, ప్రకాష్‌గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేరిక పూర్తయింది. మిగిలిన వారు ఈ వారం లోపే చేరనున్నట్లు తెలుస్తున్నది.
ఇంకా 17 మంది
నిన్న ప్రకాష్ గౌడ్, ఇవాళ అరెకపూడి గాంధీ చేరికతో ఇప్పటి దాకా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 9కి చేరింది. ఫిరాయింపుల చట్టానికి లోబడి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి సురక్షితంగా వెళ్లాలంటే.. మూడింట రెండొంతుల మంది శాసనసభాపక్షంగా ఏర్పడి సీఎల్పీలో విలీనం కావాలి. అయితే ఇందు కోసం 26కు తగ్గకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక అవసరం. దీంతో ఇంకా17 మందిని చేర్చుకోవాల్సి ఉంటుంది.



