వేలంపాటలో బాలాపూర్ లడ్డూ రికార్డ్ ధర
బాలాపూర్ గణేశుడి లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది.
బాలాపూర్ గణేశుడి లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది.అందరూ అనుకున్నట్లుగానే 30 లక్షలు దాటిపోయింది. గతేడాదికన్నా ఈ ఏడాది 3 లక్షలు అధిక ధరతో బాలాపూర్ లడ్డూని వేలంపాటలో దక్కించుకున్నారు సింగిల్ విండో ఛైర్మెన్ కొలన్ శంకర్ రెడ్డి. ఈసారి బాలాపూర్ లడ్డూ వేలంలో కేవలం ఆరుగురు మాత్రమే పాల్గొన్నారు. రూ. 1,116తో వేలం ప్రారంభం కాగా.. పోటాపోటీగా సాగిన వేలంలో కొలను శంకర్ రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు.
గత ఏడాది తుర్కయంజాల్కు చెందిన దాసరి దయానంద్ అనే వ్యక్తి లడ్డూని వేలం పాటలో రూ.27 లక్షలకు దక్కించుకోగా… ఈసారి 30 లక్షల ఒక్క వెయ్యికి కొలను శంకర్ రెడ్డి లడ్డూని కైవసం చేసుకున్నారు. వేలం అనంతరం కొలను శంకర్ రెడ్డి బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు డబ్బులను అందజేశారు. బాలాపూర్ లడ్డూ వేలంలో కైవసం చేసుకోవడం కొలను ఫ్యామిలీ నుంచే ప్రారంభమైంది. బాలాపూర్ లడ్డూ ప్రస్థానం 1994 నుంచి ప్రారంభమైంది. మొట్టమొదటిసారి బాలాపూర్ లడ్డూ వేలం నిర్వహించినప్పుడు రూ.450 తో ప్రారంభమైంది.

బాలాపూర్ లడ్డూని బంగారంలా భావిస్తారు భక్తులు. ఆ లడ్డూ దక్కించుకోవడమే అదృష్టంగా పరిగణిస్తారు. అందుకే వేలంలో పాల్గొన్ని లక్షల్లో ఖర్చుపెట్టి మరీ బాలాపూర్ వినాయకుడి లడ్డూ దక్కించుకోవడానికి ప్రయత్నిస్తారు.



