ఇలా అయితే రాహుల్ పీఎం ఎలా..!
కాంగ్రెస్ తన ఉనికిని క్రమంగా కోల్పోతుందా.. మళ్లీ 2014 పీరియడ్‌కు వెళ్తుందా..? కూటమి బలపడుతుంటే.. అందులోని కాంగ్రెస్ మాత్రం వీక్ అవుతోందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
కాంగ్రెస్ తన ఉనికిని క్రమంగా కోల్పోతుందా.. మళ్లీ 2014 పీరియడ్‌కు వెళ్తుందా..? కూటమి బలపడుతుంటే.. అందులోని కాంగ్రెస్ మాత్రం వీక్ అవుతోందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నకల్లో అధికారం తమదేనని కాంగ్రెస్ గట్టి నమ్మకంతో ఉండే. కానీ ప్రజలు మాత్రం రాహుల్‌కు షాక్ ఇస్తూ మోడీకి హ్యాట్రిక్ గెలుపును అందించారు. అయితే 10 ఏళ్ల తర్వాత మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 99 సీట్లు వచ్చాయి. ఇదొక్కటే ఆ పార్టికి ఊరటనిచ్చే అంశం. ఇంతవరకు బాగానే ఉన్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభావం తగ్గిపోతుంది. దీనికి నిదర్శనమే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వరుస ఓటములు.
ప్రస్తుత మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు ముందు హర్యానా, కశ్మీర్ ఎన్నికలు జరిగాయి. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విన్ సాధిస్తే.. కశ్మీర్లో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చింది. హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అంతా అనుకున్నారు. ఆ అతివిశ్వాసంతో పాటు స్థానిక నాయకుల మధ్య సమన్వయలోపం వల్ల అక్కడ ఓటమి ఎదురైందనే ఆరోపణలున్నాయి. ఆ తర్వాత ఆ పార్టీ పాఠాలు నేర్చుకుందా అంటే అదీ లేదు. దానికి మహా ఫలితాలే ఉదాహారణ. సేమ్ కర్నాటక, తెలంగాణలో ఇచ్చినట్లు గ్యారెంటీ హామీలను మహారాష్ట్రలోనూ ఇచ్చింది కాంగ్రెస్. అయితే ప్రజలు మాత్రం నిర్మోహమాటంగా ఆ హామీలను తిరస్కరించారు. కాంగ్రెస్‌కు ఘోరమైన ఫలితాలను అందించారు.
మహా ఫలితాలతో కాంగ్రెస్‌కు మళ్లీ గడ్డుకాలం షురూ అయ్యింది. కాంగ్రెస్ విపక్షాలను కలుపుకుని ఇండియా కూటమి పేరిట ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఈ కూటమి బలపడుతుంది కానీ కాంగ్రెస్ మాత్రం వీక్ అవుతుందనే ఆరోపణలున్నాయి. మహారాష్ట్రలో కూటమిలోని మిగితా పార్టీలకంటే అత్యధికంగా 101 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. కానీ ఫలితాల్లో డబుల్ డిజిట్ సంఖ్య రావడం కూడా ఆ పార్టీకి కష్టంగా మారింది. 10 ఏళ్ల తర్వాత సెంచరీకి చేరువైన కాంగ్రెస్..ఇప్పుడు మళ్లీ వెనక్కి వెళ్తున్నట్లుగా కన్పిస్తోంది. రాహుల్ గాంధీ ఎంత కష్టపడిన మోడీని అధిగమించి పార్టీకి ప్రజాదరణ సాధించలేకపోతున్నారనేది స్పష్టం.
ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన కాంగ్రెస్ హిమాచల్, కర్నాటక, తెలంగాణలో ఇచ్చిన గ్యారెంటీలు, హామీలనే ఇస్తుంది కాంగ్రెస్. కర్నాటక, తెలంగాణ వరకు ఇవి వర్కౌట్ అయ్యాయి కానీ.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో దారుణమైన ఫలితాలొచ్చాయి. దీంతో కాంగ్రెస్ గ్యారెంటీలకు కాలం చెల్లందనే విమర్శలున్నాయి. పైగా రాష్ట్ర ఆర్థికస్థితిని పట్టించుకోకుండా ఈ గ్యారెంటీలుంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. హిమాచల్‌లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఏకంగా ఢిల్లీ నడిబొడ్డున ఉన్న హిమాచల్ భవన్‌ను అటాచ్ చేస్తూ హిమాచల్ హైకోర్టు ఉత్తర్వులు జారీచేయడం దివాళ తీసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చెబుతోంది. ఇవన్నీ చూస్తున్నా కూడా కాంగ్రెస్ అధిష్ఠానం మళ్లీ అవే వాగ్దానాలు ఇవ్వడం విడ్డూరం. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సైతం సాధ్యంకాని హామీలు ఇవ్వొద్దని పార్టీ నేతలకు చెప్పారు. అయినా పరిస్థితిలో మాత్రం ఎటువంటి మార్పు లేకపోవడమే కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణం.
ఇక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల పరిస్థితి బాగాలేదా అనే చర్చ కూడా నడుస్తోంది. మూడు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాన్ని నడపడం సీఎంలకు కత్తిమీద సాములా మారింది. ఇప్పటికే కర్నాటక సీఎం సిద్ధరామయ్య ముడా స్కామ్‌లో చిక్కుకోగా.. మిగితా రాష్ట్రాల్లో నిధులు లేక సీఎంలు తర్జనభర్జన పడుతున్నారు. మహా ఫలితాల నేపథ్యంలో మరో ఆసక్తికరమైన చర్చ కూడా నడుస్తోంది. కర్నాటక, తెలంగాణ సీఎంలను మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ సీఎంలను మారిస్తే ఈ రాష్ట్రాల్లో పాలన గాడితప్పిందని కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకున్నట్లే. ప్రస్తుతం తరుణంలో సీఎంలను మార్చకపోవచ్చనే చర్చ కూడా సాగుతోంది. ఏదిఏమైన కాంగ్రెస్ ముందు కాకుండా వెనక్కి వెళ్తుండడం ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.



