12 ఏళ్ల తర్వాత నీలకురింజి పూలు..ఆ ప్రాంతానికి పర్యాటకుల క్యూ
తమిళనాడులోని పాలియన్ తెగ ప్రజలు తమ వయస్సును లెక్కించేందుకు ఈ పువ్వును ప్రామాణికంగా ఉపయోగించేవారు.
తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలోని పిక్కపాటి మండు గ్రామ సమీపంలోని కొండలపై 12 ఏళ్ల తర్వాత విరగబూసిన నీలకురింజి పూలు సందర్శకులను మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. కనుచూపు వరకు పరుచుకున్న ఆ పూల అందాలను వీక్షించేందుకు పర్యటకులు, స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు. నీలిరంగు పూలతో నిండిన ఆ ప్రాంతాన్ని చూడటానికి రెండు కళ్లు చాలడంలేదు. ఈ పూలు ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు మాత్రమే ఉంటాయి.
అసాధారణ ప్రత్యేకతలను కలిగిన మొక్కలలో నీలకురింజి ఒకటి. జీవితంలో ఒకసారి మాత్రమే ఇది పుష్పిస్తుంది. ఈ మొక్క మొలకెత్తిన తర్వాత 12 ఏళ్లకు పూతపూసి, ఆ తర్వాత పూర్తిగా ఎండిపోతుంది. ఆ మొక్క నుంచి రాలిన విత్తనాల నుంచి మళ్లీ కొత్త మొక్కలు మొలిచి 12 ఏళ్లకు పూతపూస్తాయి. నీలకురింజి పువ్వుల పరపరాగ సంపర్కానికి చాలా కాలం అవసరం అవుతుంది. అందుకే ఇవి వికసించడానికి 12 ఏళ్లు పడుతుంది. నీలకురింజి పూలు నీలం రంగులో ఉంటాయి.
#WATCH | Nilgiris, Tamil Nadu: Neelakurinji flowers, which bloom once in 12 years, are blooming near Utagai, the hills adjacent to the Toda tribal village called Pikkapathi Mandu. pic.twitter.com/5vgBp7c7QB
— ANI (@ANI) September 18, 2024
ఈ మొక్కల పూలు నీలం రంగులో ఉండటం వల్ల వీటికి “నీలకురింజి” అనే పేరు వచ్చింది. తమిళనాడులోని పాలియన్ తెగ ప్రజలు తమ వయస్సును లెక్కించేందుకు ఈ పువ్వును ప్రామాణికంగా ఉపయోగించేవారు. 12 ఏళ్లకు ఒకసారి పూచే ఈ పూలను చూసేందుకు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తారు.



