సునీల్ కనుగోలు చేతికి .. కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్!
కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్‌ను మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా స్పీడ్‌ను కాంగ్రెస్ వింగ్ అందుకోలేకపోతుందనే అభిప్రాయంలో సీఎం ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీకి ధీటుగా సోషల్ మీడియా ఉండాలనేది కాంగ్రెస్ ఆలోచన. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎక్కువగా కనిపించిందనే వాదనలు ఆ పార్టీ నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త సోషల్ మీడియా వింగ్ తీసుకరావాలని రేవంత్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సునీల్ కనుగోలు టీంకే బాధ్యతలు
ఏఐసీసీ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు టీమ్ ఇకనుంచి రాష్ట్ర కాంగ్రెస్ సోషల్ మీడియాను నిర్వహించేందుకు అంతర్గతంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ అఫీషియల్ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలన్నీ సునీల్ టీమ్‌లే హ్యాండిల్ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఇందుకు హైదరాబాద్‌లో ప్రత్యేక కార్పొరేట్ ఆఫీస్ సైతం తీసుకోవాలని పార్టీ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సీఎం అమెరికా టూర్ ముగిసిన తర్వాత కొత్త టీమ్స్ రంగంలోకి దిగే అవకాశం ఉన్నది. బఇక ఇప్పటికే పనిచేస్తున్న పార్టీ సోషల్ మీడియా టీమ్స్.. సునీల్ కనుగోలు టీమ్స్‌కు అనుసంధానంగా పనిచేయనున్నాయి.
బీఆర్ఎస్ వల్ల పార్టీపై వ్యతిరేకత!
ఇటీవల అసెంబ్లీలో సీఎం రేవంత్, దానం నాగేందర్ చేసిన కాంట్రవర్సీ కామెంట్లను అధికార పార్టీకి నష్టం కలిగించేలా బీఆర్ఎస్ సోషల్ మీడియా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లిందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దీని వల్ల పార్టీపై ప్రజల్లోల కొంత వ్యతిరేకత వచ్చిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసే ప్రతి దానికి కాంగ్రెస్ టీమ్స్ కౌంటర్లు ఇవ్వనున్నాయి. పొలిటికల్, అడ్మినిస్ట్రేషన్, నేతల వ్యక్తిగత అంశాలపై బీఆర్ఎస్ చేసే ప్రచారాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ సునీల్ టీమ్స్ ప్రచారం చేయనున్నాయి.



