పదోన్నతులు కల్పించాలి: ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
పదోన్నతులు కల్పించాలి: ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

పల్లవి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయ పోస్టులను అర్హులైన సీనియర్ స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించాలని కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యులు మల్క కొమరయ్య కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, పాఠశాల విద్యా సంచాలకులు ఈవీ నరసింహా రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలోనే గెజిటెడ్ ప్రధానోపాధ్యాయ పదోన్నతులు కల్పించడానికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులచే సీనియార్టీ లిస్టులు రూపొందించి వెబ్ ఆప్షన్స్ నమోదు చేసే సమయంలో సాంకేతిక కారణాల వల్ల పదోన్నతులు వాయిదా పడినట్లు గుర్తు చేశారు. అలాగే ఈ వేసవి సెలవుల్లోనే పదోన్నతులు, బదిలీలు చేపట్టి, వచ్చే అకడమిక్ ఇయర్ ప్రారంభం నాటికి ఖాళీలు లేకుండా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి పాఠ్యపుస్తకాలు, ఉచిత ఏకరూప దుస్తులను అందుబాటులో ఉంచుతూ, తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెంట తపస్ రాష్ట్ర అధ్యక్షులు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేష్, బి. ఉషారాణి తదితరులు ఉన్నారు.