తీన్మార్ మల్లన్నకు కేటీఆర్ మద్దతు
మల్లన్నకు కేటీఆర్ మద్దతు

పల్లవి, వెబ్ డెస్క్: ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ ప్రభుత్వంపై యుద్ధం చేసిన తీన్మార్ మల్లన్నకు.. ఇప్పుడు ఆ పార్టీ పరోక్షంగా మద్దతు ఇస్తున్నది. ఆ పార్టీ అధినేతతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు తీన్మార్ మల్లన్న పక్కన కనిపిస్తున్నారు. మల్లన్నకు జరిగిన అన్యాయంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నారు. బీసీ కులగణనకు సంబంధించిన రిపోర్టును చించి వేశారన్న కారణంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది. దీనిపై తీన్మార్ మల్లన్న ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ.. సస్పెండ్ చేసినా, తాను బీసీల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటానని తేల్చి చెప్పారు. అయితే బీసీల కులగణన సర్వే సరిగా జరగలేదని, కేసీఆర్ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే బాగా జరిగిందని తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే చెబుతూ వస్తున్నారో.. బీఆర్ఎస్ నుంచి కూడా అదే స్థాయిలో మల్లన్నకు మద్దతు లభిస్తున్నది.
ఇందుకు తాజా ఘటనలే ఉదాహరణలు. కేసీఆర్ పీఆర్వోగా పనిచేసిన ఘటిక విజయ్ కుమార్ ఇటీవల తీన్మార్ మల్లన్నతో కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న విజయకుమార్ ను తీన్మార్ మల్లన్న పక్కన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఘటిక విజయ్ కుమార్ మల్లన్న తరఫున మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే పార్టీ వ్యతిరేక కార్యక్రమం ఎలా అవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డ వస్తే భగ్గుమనేంతగా విభేదాలు ఉన్నప్పటికీ.. బీసీ కులగణన విషయంలో అనేక సార్లు తీన్మార్ మల్లన్న కేసీఆర్ సర్వే తీరును పొగిడారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. బీసీ కులగణన సర్వేను ప్రశ్నిస్తే ఎమ్మెల్సీని పార్టీ నుంచి ఎలా సస్పెండ్ చేస్తారు? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ ను నిలదీశారు.