బడ్జెట్ లో పచ్చి అబద్ధాలు, అసత్యాలు: హరీశ్ రావు
బడ్జెట్ లో పచ్చి అబద్ధాలు, అసత్యాలు: హరీశ్ రావు

పల్లవి, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ లో పచ్చి అబద్దాలు, అసత్యాలు ఉన్నాయని, డిప్యూటీ సీఎం భట్టి పెట్టిన బడ్జెట్ బడా జూట్ బడ్జెట్ అని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ పార్టీ తన విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఎన్నికల ముందు అన్ని చేస్తాం, అధికారంలోకి రాగానే ఏమి చెయ్యమనే మాదిరి ఈ బడ్జెట్ ప్రసంగం ఉన్నది. ఎన్నికల ముందు ఏం అడిగితే అది ఇస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి బయట, అసెంబ్లీలో అబద్ధాలే మాట్లాడుతున్నారు. లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తున్నం అన్నరు. 20 వేల కోట్లు ఇచ్చినం అంటున్నారు. గతేడాది వచ్చే ఏడాది లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తం అన్నరు. మొత్తం వర్తిస్తదా అంటే లేదు 5లక్ష వరకే వర్తిస్తది అని జీవో 27 ప్రకారం అని అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. 5 లక్షల వరకే వడ్డీ లేని రుణం, మిగతా 15లక్షలకు మహిళలే వడ్డీలు కడుతున్నరు. తీసుకున్న మొత్తం డబ్బుకు వడ్డీ లేని రుణం ఇస్తే మీరు చెబుతున్నది నిజం. అసెంబ్లీ సాక్షిగా మహిళలందర్ని ప్రభుత్వం నేడు మోసం చేసింది”అని అన్నారు.
విద్యార్థులు డ్రెస్ లు..
‘‘స్కూల్ విద్యార్థుల డ్రెస్ కుట్టు చార్జీలు రూ.75 ఇస్తున్నం అంటున్నారు. గత బడ్జెట్ లోనూ ఇదే చెప్పారు, మక్కీకి మక్కీ కాపీ కొట్టారు. ఈ ప్రభుత్వం నిజంగా ఇస్తున్నది 50 రూపాయలు మాత్రమే. రూ. 75 ఇచ్చినట్లు రెండు బడ్జెట్లలో చెప్పుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని బడ్జెట్ లో చెప్పారు. చాలెంజ్ చేస్తున్నా బీఆర్ఎస్ 6 లక్షల 47 వేల రేషన్ కార్డులు ఇచ్చినం. సోనియా గాంధితో ప్రజలకు ఉత్తరం రాయించారు, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం అని, ఈ బడ్జెట్ లో అయినా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తారని రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా చూశారు. కానీ అలా జరగలేదు. మహాలక్ష్మి ఊసే లేదు. 2500 లేదు గానీ, 2500 కోట్లు అందాల పోటీల కోసం బడ్జెట్ లో పెట్టారు. చేయూత కింద 4000 పించన్ అన్నరు. అతీ గతీ లేదు. వృద్దులు, గీత, చేనేత, ఎయిడ్స్ పేషెంట్లను కూడా మోసం చేసింది కాంగ్రెస్. కొత్త పింఛన్ ఇయ్యలేదు, ఉన్న పింఛన్ రెండు నెలలు ఎగ్గొట్టారు. లక్షా 50వేల పింఛన్లు తగ్గినయి. కోత పెట్టారు. రుణమాఫీ అయినోళ్లు తక్కువ, కానోళ్లు ఎక్కువ. రుణమాఫీ అయిపోయినట్లు చేస్తున్నరు. మిగతా వాళ్లకు ఎప్పుడిస్తరు? రెండు లక్ష మీద ఉన్నవాళ్లకు కాలేదు, లోపు ఉన్న వాళ్లకు కాలేదు. నా నియోజకవర్గంలో రెండు లక్షల లోపు ఉన్న 10,150 మందికి రుణమాఫీ కాలేదు. ఎక్కడి వెళ్దాం, ఎక్కడైనా చర్చకు నేను సిద్దం”అంటూ హరీశ్ సవాల్ విసిరారు. బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ తన విశ్వసనీయతను కోల్పోయిందని ఆయన గుర్తు చేశారు.