ఇప్పట్లో రేట్లు పెంచం .. BSNL మరో గుడ్ న్యూస్

ప్రైవేట్ టెలికం సంస్థల కంటే తక్కువ ధరకే టారిఫ్‌లను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పట్లో రేట్లను పెంచే అవకాశమే లేదని సంస్థ సీఎండీ రాబర్ట్ రవి వెల్లడించారు. వినియోగదారుల విశ్వాసం పొందడం, వారిని సంతోషంగా ఉంచడం తమ ప్రధాన లక్ష్యమన్నారు. ఇప్పటికే 4G సేవలను ప్రారంభించామని, ఈ డిసెంబర్ లోపు దేశవ్యాప్తంగా వాటిని విస్తరించడంపై ప్రధానంగా దృష్టిసారించామని తెలిపారు.
ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. వినియోగదారుల సంతోషం, వారి విశ్వాసాన్ని గెలుచుకోవడం తమ ప్రధాన లక్ష్యమన్నారు. సమీప భవిష్యత్తులో టారిఫ్‌లను పెంచాల్సిన అవసరం కనిపించడం లేదన్నారు. ఇక, వేగవంతమైన 5జీ సేవలను అందించేందుకు సిద్ధమవుతున్న బీఎస్ఎన్ఎల్ తాజాగా కంపెనీ లోగోను మార్చింది. గతంలో వృత్తాకారంలోని ఊదా రంగు లోగోపై నీలం, ఎరుపు వర్ణంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ చిహ్నాలు ఉండగా.. తాజాగా దీనికి మార్పులు చేశారు. కాషాయ రంగు వృత్తాకారం మధ్యలో భారత చిత్రపటాన్ని ఉంచారు. దానిపై తెలుపు, ఆకుపచ్చ వర్ణంలో కనెక్టివిటీ సింబల్స్‌ను ఉంచారు.