ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేయాలి -ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

పల్లవి, వెబ్ డెస్క్ : కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అధికారులకు, గుత్తేదార్లకు సూచించారు. ఈరోజు గురువారం భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలోని వేడుకల మందిరంలో ఆలయ చైర్మన్, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, దేవాదాయశాఖ, పీఆర్, ఆర్ అండ్ బీ, టూరిజం, మిషన్ భగీరథ, ఆర్ డబ్ల్యూ ఎస్ ఈఈలు, డీఈలు, ఏఈలు మరియు రేగొండ ఎమ్మార్వో, ఎంపీడీవో, గుత్తేదారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమీక్షా సమావేశంనకు ముందు ఎమ్మెల్యే బాలాలయంలో స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.
అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం జరిగిన సమీక్షా సమావేశంలో ఆలయంలో జరుగుతున్న వివిధ పనుల పురోగతిపై అధికారులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. గర్భగుడి, అన్నదాన సత్రాలు, క్యూలైన్లు, విమాన గోపురం, అర్థమండపం, ఆర్చి తదితర పనులపై రివ్యూలో చర్చ జరిపారు. అదేవిధంగా, మరో మూడు నాలుగు నెలల్లోపు అన్ని పనులు పూర్తయితే ఆలయ పున:ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. దాదాపు వంద ఏళ్ల కిందట స్వామివారికి ఆలయాన్ని నిర్మించారని, ఆలయాన్ని పట్టించుకునే నాథులు లేక ఇన్నాళ్లు నిర్లక్ష్యానికి గురైందన్నారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.12.15 కోట్లతో ఆలయంలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో ప్రధానంగా విమాన గోపురం అర్ధ మండపం, మహా మండపం పునర్నిర్మాణానికి రూ.3.77 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అద్దాల మండపం కోసం రూ.5 లక్షలు, అల్వార్ నిలయానికి రూ.1.10 లక్షలు, పాకశాల భవనానికి రూ.7.5 లక్షలు, క్యూలైన్ల నిర్మాణానికి రూ.30 లక్షలు, అన్నదాన సంత్రానికి రూ.40 లక్షలు, ఆలయంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.15 లక్షలు, భక్తుల బస కోసం రూ.5.5 లక్షలు, రూ.50 లక్షలతో చుట్టూ కాంపౌండ్, తాగునీటి ట్యాంక్ కోసం రూ.30 లక్షలు, ఈవో, ఇతర అధికారుల ఆఫీస్ కోసం రూ.50 లక్షలు, అర్చకుల వసతి గృహాలకు రూ.50 లక్షలతో ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
గణపురం మండలం బుద్దారం గ్రామం నుండి కొడవటంచ గ్రామం వరకు నిర్మాణంలో ఉన్న రెండు వరుసల రహదారి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆ శాఖ అధికారులకు సూచించారు. రేగొండ పోలీస్ స్టేషన్ వద్ద అసంపూర్తిగా ఉన్న ఆర్చి పనులు పూర్తయ్యాయని, త్వరలోనే ఆర్చిని ప్రారంభించబోతున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.