నన్ను ఎలా సస్పెండ్ చేస్తారు – ఎమ్మెల్సీ కవిత

పల్లవి, వెబ్ డెస్క్ : నేను జైలు నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో నలబై ఏడు నియోజకవర్గాల్లో పర్యటించాను. బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేశాను. గురుకులాల్లో విద్యార్థుల సమస్యలపై పోరాటం చేశాను. పార్టీ కార్యాలయం నుంచి అధికారక సమాచారం ఇచ్చే నియోజకవర్గాల్లో పర్యటించాను. పార్టీ కోసం నేను చేసిన సేవలను నాయకత్వం పునరాలోచన చేయాలి. నేను మాట్లాడుతున్నది పార్టీకి వ్యతిరేకంగా కాదు. పార్టీలో ఉన్న కొందరు నాపై కక్షగట్టారు. సామాజిక తెలంగాణ కోసం కట్టుబడి ఉన్నా.. అది తప్పా?. నేను ఏం తప్పుగా మాట్లాడాను.. సామాజిక తెలంగాణ అంటే బీఆర్ఎస్ వ్యతిరేకం ఎలా అవుతుంది?’ అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత తొలిసారిగా జాగృతి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత ఇంకా మాట్లాడుతూ “కేటీఆర్‌ను గడ్డం పట్టుకుని అడుగుతున్నా. నాపై కుట్రలు జరుగుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మీరు ఏం చేశారు?. నాపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పినా కేటీఆర్ నుంచి ఫోన్ కూడా రాలేదు. మహిళా నేతలు కూర్చోని నాపై ప్రెస్‌మీట్ పెట్టారు. అది మంచిదే.. అదే నేను కోరుకున్నది. కొందరు మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు. అందుకే నన్ను పార్టీ నుంచి బయటపడేశారు. పార్టీని అస్తగతం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నారు. రేపు కేటీఆర్‌కు ఇదే జరుగుతుంది.. కేసీఆర్‌కు ఇదే జరుగుతుంది’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు.