కేసీఆర్ కీలక నిర్ణయం.. కొడంగల్లో సభ : రేపు షెడ్యూల్ !
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రుణమాఫీ, రైతు భరోసాపై ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారు. రేపు సాయంత్రం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సభలు లేదా కార్నర్ మీటింగ్లు పెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా రుణమాఫీ చేసిందా లేదా అన్నది నేరుగా కేసీఆర్ ప్రజాక్షేత్రంలోనే తేల్చుకునేందుకే సిద్దమయ్యారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్ లోనే సభ లేదా కార్నర్ మీటింగ్ పెట్టేందుకు కేసీఆర్ నిర్ణయించినట్లుగా టాక్ వినిపిస్తోంది. రైతులతో కేసీఆర్ నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకోనున్నారు.
ఇన్నాళ్లు సైలెంట్ అయిపోయిన కేసీఆర్.. కవితకు బెయిల్ రావడంతో ఫుల్ యాక్టివ్ కానున్నారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అటు రాష్ట్ర సర్కారు త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభించింది. వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేసేందుకు బూత్ లెవెల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. దీంతో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా కేసీఆర్ ఫోకస్ పెట్టారు.. గత నెల రోజులుగా ఫామ్ హౌస్ లో మౌనంగా ఉన్న కేసీఆర్ సెప్టెంబర్ 1 నుంచి నియోజకవర్గాల వారీగా పర్యటించబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు రాష్ట్రంలో అన్ని జడ్పీ, మున్సిపల్, మండల పరిషత్ లలో గులాబీ పార్టీ జెండా ఎగురవేసింది. అదే విధంగా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి అధికార కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసరాలని బీఆర్ఎస్ వ్యూహ రచన చేస్తున్నది.



