నవగ్రహ యాగం అంటే ఏంటి.. కేసీఆర్ ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు?
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కు దైవ భక్తి ఎక్కువ.. యాగాలు, పూజలు చేయడం ఆయనకు ముందునుంచి ఉన్న అలవాటే.
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కు దైవ భక్తి ఎక్కువ.. యాగాలు, పూజలు చేయడం ఆయనకు ముందునుంచి ఉన్న అలవాటే. 2015లో ఆయన చండీయాగం, 2018, 2024లో రాజశ్యామల యాగం చేపట్టారు. ఇప్పుడు ఆయన నవగ్రహ యాగం చేస్తున్నారు. ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో వేద పండితులతో నవగ్రహ మహాయాగం చేపట్టారు కేసీఆర్ . తన సతీమణి శోభతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇందులో కేసీఆర్ కూతురు కవిత కూడా పాల్గొన్నారు. ఇంతకీ ఈ నవగ్రహ యాగం అంటే ఏంటీ.. కేసీఆర్ ఇప్పుడే ఎందుకు ఇది చేస్తున్నారనేది తెలుసుకుందాం.
నవగ్రహ యాగం అంటే గ్రహదోషాలు తొలిగించడం కోసం చేసే యాగమని ఆర్థం. ఇందులో ఒక్కో గ్రహానికి ఒక్కో పూజ ఫలితం ఉంటుంది. తొమ్మిది గ్రహాలకు తొమ్మిది రకాల పువ్వులతో వేదమంత్రోచ్ఛరణలతో పూజలు చేయాల్సి ఉంటుంది. చాలా టైమ్ పడుతుంది. జాతకరిత్యా గ్రహబలం పెరగాలన్న ఉద్దేశంతో ఈ యాగం చేస్తారు. ఏదైనా మంచిపని మొదలుపెట్టేముందు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు ఈ యాగాన్ని చేస్తుంటారని కొంతమంది పండితులు చెబుతున్నారు.
ఇన్ని రోజులు ప్రతికూల రాజకీయ వాతావరణం, కేసీఆర్ ఆరోగ్యం బాగుండకపోవడం, కవిత జైలుకు వెళ్లడంతో కేసీఆర్ ఇంట్లో కొంత ఆశాంతి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పండితుల సూచన మేరకు కేసీఆర్ నవగ్రహ యాగం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా కేసీఆర్ ఫామ్ హౌజ్ లో ఉంటున్నారు. వినాయక చవితి తర్వాత ఆయన ఊరూరా బస్సు యాత్రలు చేస్తారని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ కూడా వినాయక చవితి రోజున రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ ఈ నవగ్రహ యాగాన్ని చేస్తున్నట్లు తెలుస్తోంది. అతికొద్ది మంది సమక్షంలోనే కేసీఆర్ ఈ యాగాన్ని చేస్తున్నారు.



