మాంచెస్టర్ టెస్ట్ వివాదం – గంభీర్ సంచలన నిర్ణయం.!
Gautam Gambhir

పల్లవి, వెబ్ డెస్క్ : మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ శతకాలతో రాణించగా మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ మూడో సెషన్ ప్రారంభమైనాక మ్యాచ్ చివరి ఓవర్లలో జడేజా తొంబై పరుగులు, వాషింగ్టన్ సుందర్ ఎనబై ఐదు పరుగుల దగ్గర ఉన్నప్పుడు ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆంఫైర్ దగ్గరకు వెళ్లి మ్యాచ్ ను డ్రాగా ప్రకటించాలని కోరాడు. దీనికి అంఫైర్ అటువైపు జట్టు ఆటగాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా అని సూచించారు.
దీంతో స్టోక్స్ టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా దగ్గరకు వచ్చి మ్యాచ్ ను డ్రాగా ముగించుదామని ఆఫర్ చేశాడు. దానికి భారత్ ఆటగాడు జడేజా సున్నితంగా తిరస్కరించాడు. స్టోక్స్ ప్రతిపాదనను ఈ ఇద్దరు భారత్ బ్యాట్ మెన్స్ తిరస్కరించి చెరో శతకం చేశారు.ఈ సమయంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు, ముఖ్యంగా జో రూట్, జాక్ లీచ్.. జడేజాపై మాటల దాడితో దాడిచేశారు. అయినప్పటికీ జడేజా తన 8వ టెస్ట్ సెంచరీని (104 నాటౌట్), సుందర్ తన తొలి టెస్ట్ సెంచరీని (100 నాటౌట్) సాధించారు. మ్యాచ్ అనంతరం హ్యాండ్‌షేక్ సమయంలో స్టోక్స్ ఈ ఇద్దరు భారత ఆటగాళ్లను పట్టించుకోకుండా అవమానించడం మరో వివాదానికి దారితీసింది.
మ్యాచ్ ముగిసిన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో భారత్ హెడ్ కోచ్ గంభీర్ మాట్లాడుతూ జడేజా, సుందర్‌లకు పూర్తి మద్దతు ప్రకటించాడు. తనదైన శైలిలో ఇంగ్లండ్ ఆటగాళ్లపై ప్రశ్నలు సంధించాడు. “90 లేదా 85 వద్ద బ్యాటింగ్ చేస్తున్న ఆటగాడు సెంచరీకి అర్హుడు కాదా? ఒకవేళ ఇంగ్లండ్ ఆటగాడు తన తొలి టెస్ట్ సెంచరీకి 90 లేదా 85 వద్ద ఉంటే వారు మైదానం విడిచి వెళ్లిపోతారా? వారికి ఆ అవకాశం ఇవ్వరా?” అని గంభీర్ ప్రశ్నించాడు. “ఇది వారి ఇష్టం. ఆ ఇద్దరూ సెంచరీకి అర్హులు, వారు దాన్ని సాధించారు” అని స్పష్టం చేశాడు. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా ఈ ఇద్దరిని సమర్థించాడు. “సెంచరీ సాధించడం వారి హక్కు” అని అన్నాడు. స్టోక్స్ మాత్రం తన బౌలర్లను కాపాడుకోవడానికే డ్రా ఆఫర్ చేసినట్టు గిల్ వాదించాడు.