కాంగ్రెస్ ఎమ్మెల్యేల కబ్జాల బాగోతం
కాంగ్రెస్ ఎమ్మెల్యేల కబ్జాల బాగోతం
పల్లవి, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర పూర్తయింది. ఇప్పటి వరకు ఏమో కానీ.. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలపై కబ్జా ఆరోపణలు బయటకొస్తున్నాయి. కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ తన భూమికే ఎసరు పెట్టాడని కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడు, సినిమా డైరెక్టర్ సయ్యద్ రఫీ ఆరోపించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాఖాలో..
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎల్లమ్మ గుడికి సోదరభావంతో 4 ఎకరాల 4 గుంటల భూమిని తాను, తన సోదరులు కలిసి దానం చేశామని రఫీ చెబుతున్నారు. ఆ భూమి పక్కన ఉత్తరం వైపు సర్వే నంబర్ 264లో 32 గుంటల తమ ప్రైవేట్ భూమిని ఎల్లమ్మ గుడి ఈవో, ఇంకా కొందరు కలిసి ఎండోమెంట్ ముసుగులో కబ్జా చేస్తున్నట్లు బాధితుడు ఆరోపించారు. దీని వెనుక స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారని, ఈ కబ్జాపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు కూడా ఫిర్యాదు చేసినట్లు బాధితుడు రఫీ ప్రెస్ మీట్ లో ఆరోపించారు. గుడి కోసం రూ.30 కోట్ల భూమి ఇస్తే పక్కనున్న ప్రైవేట్ భూమిని కబ్జా చేయడమేంటని బాధితుడు మండిపడ్డుతున్నాడు.
జడ్చర్ల నల్లకుంట చెరువు
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డిపైనా కబ్జా ఆరోపణలు వినిపిస్తున్నాయి. జడ్చర్ల పట్టణం నడిబొడ్డున ఉన్న నల్లకుంటలో 4 ఎకరాల భూమిని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఆయన సోదరుడు దుష్యంత్ రెడ్డి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జడ్చర్ల ప్రజలు ఆరోపిస్తున్నారు. నల్లకుంటలో 4 ఎకరాల్లో మట్టి పోసి, కాంపౌండ్ కట్టారని, ఈ ఆక్రమణలను తొలగించాలని గతంలో హైకోర్టు ఆర్డర్లు ఇచ్చినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కబ్జా భూమి ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.




