ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై సబ్సీడీ..ఈ పథకం గురించి తెలుసా
ప్రస్తుతం దేశంలో విక్రయిస్తున్న వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 2% కంటే తక్కువగా ఉంది.
ప్రస్తుతం దేశంలో విక్రయిస్తున్న వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 2% కంటే తక్కువగా ఉంది. అయితే 2030 నాటికి దీన్ని 30 శాతానికి పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు మోదీ సర్కార్ ఇటీవల ‘పీఎం ఇ-డ్రైవ్’ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలను కొనాలనుకున్నవాళ్లకి పీఎం ఇ-డ్రైవ్ పథకం అనేక ప్రోత్సాహకాలను అందిస్తుంది.
పీఎం ఇ-డ్రైవ్ అంటే పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవెల్యూషన్ ఆన్ ఇన్నోవేటివ్ వెహికిల్ ఎన్ హాన్స్ మెంట్. ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగాన్ని పెంచేందుకు ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం దీని ప్రధాన లక్ష్యం. ఈ స్కీమ్ కోసం రూ. 10,900 కోట్ల నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ పథకం రెండు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది.
ఈ స్కీమ్ లో వివిధ రకాల ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ప్రభుత్వం సబ్సీడీ అందిస్తుంది. ఈ పథకం కింద బ్యాటరీతో నడిచే ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు, అంబులెన్స్‌లు, ట్రక్కులు, ఇతర ఈవీలకు రూ.3,679 కోట్ల సబ్సిడీ ఇవ్వనున్నారు. మార్చి 2025 వరకు ఈ స్కీమ్ లో భాగంగా ఎలక్ట్రిక్ టూవీలర్స్ పై రూ.10000, ఎలక్ట్రిక్ త్రీవీలర్స్ కొనుగోలుపై రూ.50000 వరకు సబ్సీడీ అందించనున్నారు. 2026 మార్చి నాటికి ఎలక్ట్రిక్ టూవీలర్లకు 10% మార్కెట్ వాటాను, ఎలక్ట్రిక్ త్రీ వీలర్లకు 15 శాతం మార్కెట్ వాటాను సాధించాలని ఈ స్కీమ్ ద్వారా లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రమంత్రి కుమారస్వామి తెలిపారు. ఎలక్ట్రిక్ కార్లను ఈ పథకం నుండి మినహాయించారు. ఎందుకంటే ఇప్పటికే 5 శాతం తక్కువ GST రేటు నుండి అవి ప్రయోజనం పొంతున్నాయని కుమారస్వామి తెలిపారు.
మొత్తంగా 28 లక్షల వాహనాల కొనుగోలుదారులకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం లభిస్తుంది. ఈ స్కీమ్ లో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రూ. 2 వేల కోట్ల వరకు కేటాయించింది. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద రాష్ట్ర రవాణా సంస్థలు, ప్రజా రవాణా సంస్థలు 14,028 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు రూ.4,391 కోట్లు కేటాయించారు.



