తెలంగాణలో ‘ఏఐ’ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ..

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ‘ఏఐ’ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ ‘డికన్(Deakin) విశ్వవిద్యాలయం’ ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్(ఎల్ వోఐ)పై సోమవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో ‘డికన్ యూనివర్సిటీ’ వీసీ ప్రొఫెసర్ ఇయాన్ మార్టిన్, ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రా సంతకాలు చేశారు.
అనంతరం ఈ ఒప్పంద పత్రాలను పరస్పరం మార్పిడి చేసుకున్నారు. ‘అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా ఏఐ రంగంలో తెలంగాణను గ్లోబల్ లీడర్ గా తీర్చిదిద్దాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం. ఏఐలో నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుకు డికన్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నాం. ఇది కేవలం లాంఛనప్రాయ ఒప్పందం కాదు అని అన్నారు.
ఇది రాబోయే రోజుల్లో కీలక రంగాల్లో తెలంగాణ, ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షి సంబంధాల మెరుగుదలకు దిక్సూచీగా మారుతుంది. సమాజానికి ఉపయోగపడే అత్యాధునిక ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడంతో పాటు పరిశోధనలు, వ్యవస్థాపకతకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది’ అని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.