మన చేతిలో చచ్చిన టెర్రరిస్టులు వీళ్లే
మన చేతిలో చచ్చిన టెర్రరిస్టులు వీళ్లే

పల్లవి, వెబ్ డెస్క్: భారతదేశంపై నాటి నుంచి నేటి వరకు అనేక ఉగ్రవాద దాడులు జరిగాయి. ఇటీవల పహల్గాం ఉగ్రదాడి యావత్తు దేశాన్ని కలచివేసింది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని ప్రపంచదేశాలు భారత్ కు మద్దతు పలుకుతున్నాయి. అయితే ఇప్పటి వరకు భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను న్యాయబద్ధంగా దోషులని నిర్ధారించి ఉరిశిక్ష వేసింది. మరికొందరిని సైన్యం కాల్పుల్లో మట్టుబెట్టింది.
1. మక్బూల్ భట్: జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ వ్యవస్థాపకుడు. వీడు అనేక దురాగతాలకు పాల్పడ్డాడు.1966లో ఒక పోలీసు అధికారిని కాల్చి చంపిపాడు. ఒక ట్రెజరీని దోపిడీ చేశాడు. 1971లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానంను హైజాక్ చేసి లాహోర్‌కు తరలించడంలో మక్బూల్ భట్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఘటన భారతదేశంలో తీవ్ర కలకలం రేపింది. జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశం నుంచి వేరు చేసి స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేయాలని వీడు కోరుకున్నాడు.1984 ఫిబ్రవరి11న తిహార్ జైలులో ఉరితీయబడ్డాడు.
2. అజ్మల్ కసబ్: అజ్మల్ కసబ్ భారతదేశంలో 2008 ముంబై దాడులలో ప్రధాన పాత్ర పోషించాడు. 2008 ముంబై ఉగ్రదాడిలో 166 మంది మరణించారు. వీరిలో పౌరులు, భద్రతా సిబ్బంది ఉన్నారు. దాదాపు 300 మందికి పైగా గాయపడ్డారు. 2008 నవంబర్ 26న అసబ్ పట్టుబడగా.. సుమారు 4 సంవత్సరాల పాటు జైలులో ఉంచి 2012 నవంబర్ 21న పూణేలోని యెరవాడ సెంట్రల్ జైలులో ఉరిశిక్ష వేశారు. అయితే.. తుకారాం ఓంబ్లే అనే అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ తన ప్రాణాలు పోతున్నా.. బుల్లెట్లతో శరీరం జల్లెడ పడుతున్నా.. కసబ్ ను ప్రాణాలతో పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అతని త్యాగానికి గుర్తుగా భారత ప్రభుత్వం అశోక చక్ర పురస్కారం ఇచ్చి గౌరవించింది.
3. అఫ్జల్ గురు: 2001 భారత పార్లమెంటు దాడిలో ప్రధాన నిందితుడైన అఫ్జల్ గురు.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు.. ఉగ్రవాదులకు అవసరమైన ఆయుధాలు, పేలుడు పదార్థాలను సమకూర్చడంలో సిద్ధహస్తుడు. దాడులకు ప్లాన్ చేయడం.. వాటిని ఎగ్జిక్యూట్ చేయడం వీడికి వెన్నతోపెట్టిన విద్య. 2001 డిసెంబర్13న భారత పార్లమెంట్ భవనంలోకి ఐదుగురు ఉగ్రవాదులు చొరబడటానికి ప్రయత్నించారు. ఈ దాడిలో ఎనిమిది మంది భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి మరణించారు. దాడి జరిగిన సమయంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి, కానీ అదృష్టవశాత్తూ ఎవరూ రాజకీయ నాయకులు మరణించలేదు. అఫ్జల్ గురు ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా.. ఈ దాడి వెనుక ఉన్నదే వీడేనని కోర్టు తేల్చడంతో 2013 ఫిబ్రవరి 9న తిహార్ జైలులో వీడిని ఉరితీశారు..
4. యాకూబ్ మెమన్: యాకూబ్ మెమన్ 1993 ముంబై బాంబు పేలుళ్లలో కీలక సూత్రధారులలో ఒకడు. పేలుళ్లకు ప్రణాళికలు వేయడం, నిధులు సమకూర్చడం, లాజిస్టిక్స్ నిర్వహించడంలో వీడు సిద్ధహస్తుడు. 1993 మార్చి 12న ముంబైలో జరిగిన ఈ వరుస బాంబు పేలుళ్లలో 257 మంది మరణించారు. 700 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులు దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయి. యాకూబ్ మెమన్ నేరుగా బాంబులు పెట్టకపోయినా, ఈ దుర్ఘటనకు దారితీసిన విస్తృతమైన కుట్రలో అతని కీలక పాత్ర కారణంగానే అతన్ని దోషిగా నిర్ధారించారు. 2015 జూలై 30న తన పుట్టినరోజున వాడిని ఉరితీశారు.
5. బసిత్ అహ్మద్ దార్: లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కమాండర్‌గా వీడు. దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో పుట్టాడు. శ్రీనగర్, ఇతర ప్రాంతాల్లో పౌరులు, భద్రతా సిబ్బంది హత్య కేసుల్లో వీడి ప్రమేయం ఉన్నది. ఎన్ఐఏ వీడిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ప్రకటించింది. వీడిని పట్టించిన వాడికి రూ.10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. 2024 మే 7న, దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో బసిత్ అహ్మద్ దార్ హతమయ్యాడు.