ఏకైక ఆలయం… మానవ ముఖంతో కనిపించే వినాయకుడు!
సహజంగా వినాయకుడి విగ్రహం అంటే గజ ముఖంతోనే కనిపిస్తుంది. కానీ తమిళనాడులోని తిలాతర్పణపురి ఆదివినాయకర్ ఆలయంలో మాత్రం మానవముఖంతో ఉన్న గణనాథుడు భక్తులకు దర్శనమిస్తాడు. అందుకే ఈ గణనాథుడిని నర ముఖ వినాయకుడు అని కూడా అంటారు. ఏనుగు ముఖం గల గణేశుడు కావడానికి ముందు ఇది గణేశుడి దివ్య రూపం.
పార్వతీ అమ్మవారు పసుపు నలుగు నుంచి తయారుచేసి ప్రాణం పోసిన గణేశుడు పరమశివుడు తల ఖండించిన తర్వాత గజాననుడిగా మారాడు. అమ్మవారు తొలిగా చేసిన బుజ్జి గణపయ్య రూపమే ఇక్కడ పూజలందుకుంటోంది. ఇక్కడ పిండప్రదానం పితృదేవతలకు ముక్తిదాయకమని ప్రతీతి. ఈ విగ్రహం 5 అడుగుల ఎత్తు,నడుము చుట్టూ నాగుపాము చుట్టబడి ఉంటుంది. గ్రానైట్ తో మానవ ముఖ వినాయకుడి విగ్రహాన్ని చెక్కారు. గొడ్డలిని చేతిలో పట్టుకుని ఉంటాడు. ఈ ఆలయాన్ని ఇది 7వ శతాబ్దంలో నిర్మించబడిందని పురాణాలు చెబుతున్నాయి.

పురాణాల ప్రకారం గణేషుడిని పార్వతీదేవి సృష్టిస్తుంది. మట్టి, నెయ్యిని ఉపయోగించి తయారు చేసింది. ఆ తర్వాత జీవం పోస్తుంది. పార్వతిదేవి ఒకరోజు స్నానానికి వెళ్లినప్పుడు ఆమె గణేషుడిని తలుపు వద్ద కాపలాగా ఉండమని కోరుతుంది. కొంతసమయం తర్వాత శివుడు పార్వతి వద్దకు వచ్చినప్పుడు ఆ ప్రాంగణంలోకి అనుమతించలేదు వినాయకుడు. దీంతో కోపోద్రిక్తుడైన శివుడు వినాయకుడి తల నరికేస్తాడు.విషయం తెలిసి పార్వతిదేవి ఆగ్రహిస్తుంది. అప్పుడు దేవతలు అందరూ సమావేశమై మానవముఖానికి బదులుగా ఏనుగు తలని పెట్టి గణపతిని బతికిస్తారు.



