అసదుద్దిన్ నోరు అదుపులో పెట్టుకో: ఎన్వీఎస్ఎస్
అసదుద్దిన్ నోరు అదుపులో పెట్టుకో: ఎన్వీఎస్ఎస్

పల్లవి, హైదరాబాద్: సబ్ కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో భారత దేశంలోని ప్రజలందరిని ప్రధాని మోడీ సమానంగా చూస్తున్నారని, కులాలు, మతాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తున్నదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే, ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంఐఎం అధినేత అసదుద్దిన్ మైనారిటీలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని, మోడీ ప్రభుత్వం మైనారిటీల పై కక్ష, వివక్ష చూపుతోందని ప్రతిరోజు విమర్శలు చేస్తున్నాడని, దానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు మద్దతు తెలుపుతున్నారని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా మైనారిటీలపై వివక్ష కనబడదన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టకుండా పరోక్షంగా ఎంఐఎంకు మద్దతు తెలుపుతున్నాయని, గత 25 ఏండ్లుగా వారి కుటుంబమే హైదరాబాద్ లోక్ సభ స్థానాన్ని గెలుస్తోందని మండిపడ్డారు. వారి కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందని, పేదవారు పేదలుగానే ఉన్నారని, కుటుంబ పాలన నుంచి విముక్తి పొందాలనుకునే ఎంఐఎం కార్పోరేటర్లకు ఈ ఎన్నిక మంచి అవకాశమని, వారికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఎంఐఎం కార్పొరేటర్లకు సూచించారు. వక్ఫ్ సరవరణ చట్టం పేద ముస్లింలకు వరమని, 77,538 ఎకరాల వక్ఫ్ భూములుంటే వాటిలో దాదాపు 75 శాతం భూములు ఎంఐఎం నాయకుల చేతుల్లోనే ఉన్నాయని, దాని ద్వారా లక్షల రూపాయల కిరాయలు వసూలు చేస్తూ అమాయక ముస్లింలను రెచ్చగొట్టి వారి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఎన్వీఎస్ఎస్ మండిపడ్డారు. బీజేపీది స్ట్రెయిట్ ఫైట్ అని కాంగ్రెస్, బీఆర్ఎస్ ది ఎంఐఎంతో డూప్ ఫైట్ అన్నారు. కుమ్మక్కు, తాకట్టు రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఆ పార్టీ కార్పోరేటర్లు ఎన్నికలను బహిష్కరించి బుద్ధిచెప్పాలని ఆయన సూచించారు. భద్రత విషయంలో అసదుద్దిన్ అనవసరంగా మాట్లాడుతున్నారని, మోడీ పై విమర్శలు చేసేప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. 23న జరిగిగే జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గౌతం రావు విజయం తథ్యమన్నారు.