భూ వివాదంలో ఐఏఎస్ రోహిణి
పల్లవి బెంగళూరు: కర్ణాటక కేడర్‌కు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి భూ వివాదంలో చిక్కుకున్నారు. తన భూమిని ఆమె ఆక్రమించారని ఆరోపిస్తూ బాలీవుడ్ సింగర్ లక్కీ అలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కాపీని ఆయన ‘ఎక్స్’ అకౌంట్ లో పోస్ట్ చేశారు. బెంగళూరు శివారులోని యెలహంక ప్రాంతంలో తన వ్యవసాయ భూమిని ఐఏఎస్ రోహిణి, ఆమె భర్త సుధీర్ రెడ్డి, బంధువు మధుసూదన్ రెడ్డి అక్రమంగా లాక్కొన్నారని లక్కీ అలీ ఆరోపించారు. ఇందుకు కొందరు స్థానిక పోలీసు అధికారులు ఆమెకు సాయం చేసినట్లు తెలిపారు. 2022లోనే దీనిపై తాను కేసు పెట్టినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అందుకే తాను లోకాయుక్త పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. లక్కీ అలీ ఫిర్యాదుతో యెలహంక న్యూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



