కాళేశ్వరంపై సీబీఐ విచారణ – సీఎం రేవంత్ రెడ్డి

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో పీసీ ఘోష్ నివేదికపై చర్చ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీ పినాకి చంద్ర ఘోష్ను విచారణ కమిషన్ ను (COI) నియమించింది.విచారణ కమిషన్ తన నివేదికను జూలై 31, 2025న ప్రభుత్వానికి సమర్పించింది. ఆగస్టు 4, 2025న జరిగిన మంత్రి మండలి సమావేశం ఈ నివేదికను ఆమోదించింది. తదుపరి చర్చ జరిపేందుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని మంత్రిమండలి చేసిన తీర్మానం ప్రకారం, ఈ నివేదికపై ఈ రోజు శాసనసభలో చర్చ జరిగింది.
రిటైర్డ్ జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ తమ నివేదికలో క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు, అవకతవకలను గుర్తించింది. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తొక్కిపెట్టడం, ఆర్థిక అవకతవకల వంటి అంశాలను ప్రస్తావించింది. మూడు బ్యారేజీల నిర్మాణంలో తప్పు జరిగిందని, అసలు ప్లానింగ్ లేదని కమిషన్ తేల్చి చెప్పింది.నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదిక ప్రకారం, మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ లోపాలు కారణమని తేలింది. నాణ్యత, నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల నిర్మాణంలో లోపాలు ఏర్పడ్డాయని NDSA గుర్తించింది. ఈ అంశాలన్నింటిపై లోతుగా మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని NDSA, విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి.
ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు, ఏజెన్సీలు పాలుపంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో WAPCOS వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, PFC, REC వంటి ఆర్థిక సంస్థలు పాలుపంచుకున్నందున, ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి అప్పగించడం సముచితము.అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది అని ఆయన తెలిపారు.